అమ్మవారి పాదాలు ఈ లోకంలో అత్యంత ఉత్తమమైన పాదాలు.ఆ తల్లి పాదాలలోనే సృష్టిలోని సకల ఉన్నత గుణాలు దర్శనమిస్తూ వుంటాయి.
సాధారణంగా మనుష్యుల పాదాలు చూస్తే వాటిలోని అనేక లోపాలు మన మనసుకి కనిపిస్తూ వుంటాయి.రంగు బాలేదు, కొలతలు బాలేదు,ఆకర్షణ లేదు,బంగారం లేదు, మెరుపు లేదు అని మన మనస్సులు అనేక వంకలు చెబుతూ వుంటాయి.
అమ్మవారి పాదాలు వంక పెట్టటానికి సాధ్యం కానివి.అంటే అమ్మవారి దివ్య పాదాలు చూడగానే మన వంకలు పెట్టే మనస్సు కూడా వంక పెట్టకుండా ఊరుకుంటుంది.అటువంటి మహోన్నత గుణాలతో విలసిల్లే పాదాలు శ్రీ కాళీ అమ్మవారి సొంతం.
మనం మంచి గుణాలు అన్నీ ఒక చోట చూడలేము.మంచి గుణాలు చూడాలంటే ఒక గురువు,లేదా యోగిని స్త్రీల చెంతకి వెళతాము .వారిలో వున్న మంచి గుణాలు మన మనస్సుకి అర్థం అయినట్లు వుంటుంది.కానీ వాటిని మన మనస్సు వ్యక్తం చేయలేదు.అమ్మవారి పదాలలో విశ్వంలోని సకల సుగుణాల సమూహం కొలువుతీరి వుంటుంది.ఇంకా , ఈ సుగుణాల సమూహం మనకి దర్శనమిస్తుంది.
సహజంగా, ఎవ్వరికీ అమ్మవారి పాదాలలోని సుగుణాల సమూహం దర్శనమివ్వదు.ఆ మహాదేవి శ్రీ కాళీ మాత తలచు కుంటే , ఈ జగత్తులోని ధర్మరాశి, నీతిరాశి, సుగుణరాశి మనకి దర్శనమిస్తుంది.ఈ రాసులని పుస్తకాల్లో పొందు పరచడం ఆ తల్లి దివ్య అనుగ్రహమే.మన ధర్మ శాస్త్రం,నీతి శాస్త్రం, అమ్మవారి పాదాల నుండి ఆవిర్భవించినవే.ధర్మము,నీతి, సుగుణము ఇవి విశ్వాన్ని నడిపించే గొప్ప సూత్రాలు.ఈ జగత్తు శ్రీ మహా కాళీ అమ్మవారు అయితే, ఆ తల్లి నడకే ఈ మహా జగత్ సూత్రాలు.ఆ తల్లి పాదాలు ఎక్కడ నడుస్తాయో ,ఆ ప్రదేశంలో ఈ మూడు రాశులు అక్కడ పడిపోతాయి.

ఒక మహాగొప్ప రాణిగారు తాను ప్రయాణం చేసిన ప్రదేశంలో ధనం,రత్నాల రాశులు అక్కడి పేదవారికి రాశులు రాశులుగా ఇచ్చేసి, వారిని సంతోష పరుస్తుంటారు.మనం అందరం అమ్మవారి దగ్గర వున్న అత్యంత పేదవారం.మన పేదరికం ఏమిటో ఆ మహాదేవి శ్రీ కాళీ అమ్మవారికి తెలుసు.మనము ధర్మరాశి, సుగుణ రాశి,నీతిరాశి లేక అత్యంత హీనమైన దుర్భరమైన కష్టాలు,బాధలతో వున్న జీవితాన్ని జీవిస్తూ వుంటాము.ఈ జగత్ రాశులను మనం దర్శించి సొంతం చేసుకోవాలి.అప్పుడే మనకి మహోన్నత జీవితం ప్రాప్తిస్తుంది.
గురువు చెంత, అమ్మవారి చెంత ధనం ,బంగారం హరించటం మహాపాపం.మనము వీరి చెంత వున్న జగత్ రాశులను (ధర్మ,సుగుణ,నీతి) హరించాలి.వీరి చెంత ఈ రాశులు పర్వతాల వలె పేరుకుపోయి వుంటాయి.ఈ పర్వతాలను చూసి మనకి ,మన జీవితానికి సరిపోయే రాశి సమూహాన్ని మనం ఉచితంగా పొందవచ్చు.ఈ సంపదల వలన మన మనస్సు, బుద్ది ( త్రి నేత్రం) తేజోవంతం అవుతాయి.తేజోవంతమైన బుద్ది జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది.ముందు ,సంపదలు కనిపించిన తరువాతనే ,వాటిని పొందే ప్రయత్నం చేస్తాము.అదే విధంగా, అమ్మవారి పదాలలో వున్న సంపదలు మనకి దర్శన మిచ్చిన తరువాతనే తపస్సు చేసి వాటిని పొందగలుగుతాము.ఓం శ్రీ కాళికా దేవ్యై నమో నమః.