ఉపవాసం చెడు అలవాట్లను దూరంచేస్తుంది
రచన: శ్రీ రాధానంద కాళీ యోగిని
మన హిందూ సంస్కృతిలో ఉపవసానికి చాలా ప్రాముఖ్యత వుంది.ఏదైన మంచి పండుగ రోజు వస్తే చాలా మంది ఉపవాసం చేస్తుంటారు.మనిషి కర్మిష్ఠి, నిత్యం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు.చెడు కర్మకి చెడు ఫలితం ,మంచి కర్మకి మంచి ఫలితం.విద్యార్థి బడిలో చదివిన పాఠాలు ఇంట్లో చదవకపోతే ,అదే అలవాటుగామారి చదువులో వెనక బడటం మొదలవుతుంది.చెడు స్నేహితులతో స్నేహం ప్రారంభించి కొనసాగించేవారికి చెడు స్నేహాలే అలవాటుగా మారిపోతాయి.ఈ విధంగానే అన్నీ రకాల చెడు అలవాట్లు వస్తుంటాయి.

ప్రతిరోజూ సినిమాలు చూసే వారికి అవే అలవాటుగా మారిపోతాయి.మానవత్వానికి హాని కలిగించేవే చెడు అలవాట్లు.కొందరికి ఇవి వ్యసనంగా మారిపోతాయి అప్పుడు వీటిని దూరం చేయటం కష్టతరమవుతుంది.ప్రతినిత్యం ఎక్కువ ఆహారం భుజించేవారికి అదే నిత్య అలవాటుగా మారిపోతుంది.
ఇక మంచి అలవాట్లు అంటే కొందరికి మహనీయుల జీవిత చరిత్రలు చదివే అలవాటు ఉంటుంది,ఇంకొందరికి ధ్యానం చేసే మంచి అలవాటు ఉంటుంది, మరుకొందరికి దేవుని పాటలు పాడుకొనే అలవాటు ఉంటుంది, ఇంకొందరికి సంధ్యా వందనం,యోగాభ్యాసం,మంత్రజపం,నేర్చుకున్న పాఠాలు వల్లెవేసుకోవటం ఇలా మంచి అలవాట్లు మంచి జీవనాన్ని శుద్ధసత్వ గుణాన్ని పెంచుతాయు.
ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం.ఎవరికి దగ్గరగా ఉండటం ?
ఎవరికి వారు దగ్గరగా ఉండటం.ఆత్మకి దగ్గరగా ఉండటం,పరమాత్మకి దగ్గరగా ఉండటం,అంతర్ముఖమవ్వటం.
మనిషి తన మనస్సు తన దగ్గర ఉంచుకోకుండా వస్తువులపైనా, ధనం పైన,ఆహారం పైన,ఆస్తిపైన,నూతన వస్త్రాల పైన,వ్యాపారం పైన ఉంచుతాడు.మనసు ఇతరంగా వున్నవాటన్నింటి పైనా ఉంటుంది కాని తన దగ్గర ఉండదు.మనసుని తన దగ్గర ఎటూ తిరగకుండా నిలపటమే ఉపవాసం.
ఈ ఉపవాసం ద్వారా చెడు అలవాట్లని ఎలా దూరం చేయాలి ?
ఒక మంచి పర్వదినం రోజు ఒక పుణ్యప్రదేశంలో ఏదైనా దేవాలయంలో,దేవుని గదిలో కూర్చొని రోజంతా ఆహారం స్వీకరించకుండా కేవలం నీరు మాత్రమే స్వీకరిస్తూ మనసులోని ఆలోచనలని ధ్యానం లేదా ప్రాణాయామం ద్వారా నిలపాలి .ఈ విధంగా రోజంతా చేయటం ద్వారా దేహంలోని చెడు అలవాట్లు క్రమంగా ఒక్కొక్కటి దూరమవుతాయి.మరుసటి రోజునుంచి మరలా జీవనాన్ని కొన్ని మంచి అలవాట్లతో ప్రారంభిస్తే అవి జీవితాంతం మనతోనే ఉంటాయి.మెరుగైన తేజోవంతమైన జీవనానికి దారులే మంచి అలవాట్లు.
రచన: శ్రీ రాధానందకాళీ యోగిని