మనమనస్సు మహాకోవెల 🧘 – మహా సమాధి 🧘
🌸Exhaustion- Smashana – Samadhi
అలసట- స్మశానం – సమాధి🌸
🌞ఓం శ్రీ కాళికా దేవ్యై నమః🌞
🌞ఆలయంలో ధ్యానం చేస్తారు, స్మశానం లో ధ్యానం చేస్తారు.కానీ నిజానికి స్మశానం తరువాతే ఆలయ నిర్మాణం జరుగుతుంది. స్మశానం నుండి ఆలయానికి మన మనస్సు ప్రయాణించాలి.
సాధారణ మానవులు కొంచెం పనిచేసే సరికి అలసట చెందుతారు.తరువాత కొంచెం కూర్చొని వారి మనో స్థితిని బట్టి , అంటే వారి మనస్సు ప్రేమ పూర్వకంగా వుంటే వారికి ఇష్టమైన వారి గురించి ఆలోచిస్తారు, మనోస్థితి ద్వేషంతో వుంటే వారి శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు.
మనం మన మనసులో ఇతరుల రూపం పొందుతున్నాము అంటే వారు మన శక్తిని దొంగిలిస్తున్నారు అని అర్థం.
ఇతరులు మనల్ని పదే పదే ద్వేషిస్తున్నారు , కదిలిస్తున్నాను అంటే వారు శక్తిహీనులుగా వున్నారు, మన శక్తిని ఏదో విధంగా పొందటానికి సాహసం చేస్తున్నారు అని అర్థం. ఇది సృష్టిలో శక్తి దొంగతనం.
మనం ఇతరుల గురించి ఎంత ఆలోచిస్తే మనశక్తి వారికి అంత వెళ్ళిపోతుంది.
🌼” మన మనసులో ఎందరో మనుషుల రూపాలు వుంటాయి , మన రూపం తప్ప.” 🌼
మన రూపం అద్దంలో తప్ప గుర్తు పట్టలేము, కానీ ఇతరులలో కొంచెం మార్పు వచ్చినా చక్కగా గుర్తు పడతాము. కొందరు రాత్రి వేళ తమ రూపాన్ని అద్దంలో చూసుకోవటానికి భయపడుతుంటారు. వారి రూపంలో దయ్యం కనిపిస్తుందేమో అని.నిజంగా దయ్యం కనిపించవచ్చు .
మన దేహంలో వున్న శక్తి అద్దంలో కనిపిస్తుంది. మనలో రాక్షస గుణాలు ఎక్కువగా వుంటే మనకి మన రాక్షస రూపం కనిపిస్తుంది. మనలో దివ్య గుణాలు అధికంగా వుంటే, అద్దంలో మన దైవిక రూపం కనిపిస్తుంది.ఈ రూపం చూడాలంటే మన అద్దంలో మన రూపాన్ని కనీసం 30 నిమిషాలు చూడగలగాలి .
మన మనస్సుని ఒక దేవాలయం చేసుకోవాలి . అందులో మనమే దేవత. మన దేవాలయంలో ఇతర రూపాలు వుండకూడదు. మన మనసు అనే దేవాలయంలో ఇతర రూపాలు వుంటే అది వారి దేవాలయం , మనం వారి ఆరాధకులం అవుతాము. మన దేవాలయంలో ఎందరి రూపాలు వుంటే మనం అంతమంది ఆరాధకులం అవుతాం. మనం ఆరాధకులం కాదు, దేవతలం మహాశక్తి వంతులం.
మన దేవాలయంలో మన రూపం ఎలా నిర్మించి స్థాపితం చేయాలి?
🌼
“ముందుగా మన దేవాలయానికి అనువైన భూమి కావాలి” 🌼
అదే స్మశాన భూమి. స్మశానంలో అన్నీ మరణించి వుంటాయి.అంటే స్మశానంలో రూపాలు మరణించి వుంటాయి.
🌼”రూపాలు నశించిన స్థలమే స్మశానం” 🌼
చాలా మంది స్మశానం లో తపస్సు చేస్తుంటారు.
స్మశానంలో తపస్సు కాదు మన మనస్సుని రూపాలు లేని స్మశానం చేసి ,అందులో , అంటే మన మనో – స్మశానం లో తపస్సు చేయాలి.
🌼రుపాలకి శక్తి, మనో భావాలు వుంటాయి.🌼
రూపాలు కలిగిన వారే మానవులు. మానవుల రూపాలు అంతమయ్యే స్థలం స్మశానం.
ఈ స్మశానంలో ఇక మరో రూపం , మానవులు పుట్టరు. ఎందుకంటే ఇది సంసారానికి యోగ్య భూమి కాదు, పునరుత్పత్తికి యోగ్య భూమి కాదు. పునరుత్పత్తి జరగని చోట మోక్షం ఉత్పన్నం అవుతుంది.స్మశానం మోక్ష భూమి. మన మనస్సు స్మశానంగా మారినపుడు అది మహామోక్షభూమి అవుతుంది .
మన మనస్సుని కూడా స్మశానస్థలం చేయాలి. మనం ప్రతి నిత్యం మాట్లాడే వారి రూపాలు మన మనస్సు అనే స్మశానంలో మరణించాలి.ఇతరుల రూపాలు మరణించి నపుడు వారు మన నుండి ద్వేషంతో, పగతో, ప్రతీకారం తో మనల్ని కదిపి , మన మనసులో చొరబడి మన శక్తిని అపహరించలేరు. మన శక్తిని ఇతరులు మన మనస్సులో చొరబడినపుడే దొంగిలించి వేయగలరు.
మన మనస్సులో ఇతరులు రెండు విధాలుగా చొరబడి శక్తి దొందిలించటానికి ప్రయత్నిస్తుంటారు.
🌼ఒకటి ప్రేమ పూర్వకంగా
🌼ఇంకొకటి ద్వేష పూర్వకంగా.
యవ్వనంలో వున్నవారు ఇతర స్త్రీ , పురుషలకి ఆకర్షింప బడి వారిని తమ మనసులో ఆరాధించినపుడు , వీరి శక్తి వారికి వెళ్లి పోతుంది. ఫలితంగా వీరు తమ మార్గ భ్రష్టులు అవుతారు.
జీవితంలో అసలు ఏ గమ్యం చేరుకోలేక ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ వుంటారు కాని తమ మనసులో ఇతరులని తీసివేయడం చేయరు. ఇతర మానవుల రూపాలు మన మనసులో వున్నపుడు అవి మనకి దీర్ఘ కాలం దుఃఖము వుత్పన్నం చేస్తూవుంటాయి.
(ఇది కేవలం సాధారణ మానవుల రూపాలకు మాత్రమే వర్తిస్తుంది . యోగుల రూపాలు మన మనసులో వుంటే మనం దీర్ఘ కాలం ఆనందం పొందుతాం.)
ఈ రెండు విధాలుగా మనం ఇతరుల రూపం మన మనసులో పొందితే మన శక్తి వృధా అవుతుంది.మనం నీరసం పొందుతాము నిత్యం.
కావున మనం పూర్తి శక్తివంతులుగా నిత్యం వుండాలి అంటే మన మనసు నుండి ఇతరుల రూపాలు తీసేసి, మరణింపజేసి మన మనసును స్మశానంగా మార్చుకోవాలి. ఇక ఆ స్మశానంలో ఎవరు వచ్చినా అంటే ఏరూపం వచ్చినా మరణిస్తుంది. మన జీవన గమ్యం సుగమం అవుతుంది.
🌼ఆలయనిర్మాణం – స్వరూపస్థాపన🌼
మన ఆలయానికి యోగ్య భూమి ఏర్పడింది. ఇక ఆలయ నిర్మాణం వున్నది.
ఆ మహా మోక్ష భూమి మనో – స్మశానంలో మన రూపం స్థాపన చేయాలి. మన ఆలయంలో మన రూపం తప్ప వేరే రూపాలు వుండకూడదు.
మనం ప్రతినిత్యం అద్దంలో మన రూపం చూసి ఆనందిస్తాము.ఇది చాలా మంచి ప్రక్రియ. ఇలాగే మనం అద్దంలో మన రూపం ఎక్కువ సేపు చూసుకుంటూ వుంటే మన రూపం మన మనస్సులోకి చేరుకుంటుంది. మన మనస్సు అనే స్మశానంలో చేరిన మన రూపం మరణం పొందదు. ఎందుకంటే మన మనస్సు మన నిర్మితం, మన రూపం మన నిర్మితం.కావున మన రూపాన్ని ఆ మహా స్మశానం లో స్థాపితం చేయాలి. మన మనస్సు అనే ఆలయం ఇప్పుడు నిర్మింపబడింది.ఆ ఆలయంలో మన దేవతారూపం స్థాపన చేయబడింది. మీరే దేవత. మిమ్మల్ని మీరు, మీ ఆలయంలో ఆరాధన చేసుకుంటే మీరు మహాశక్తివంతులు అవుతారు. మన దివ్య ఆలయంలో ,మన దివ్య రూపాన్ని, దివ్య చక్షువు ద్వారా దర్శిస్తూ నిత్యానందాన్ని పొందుదాం . నడిచే ఆలయంగా మార్పు చెందుదాం.
మన మనో ఆలయంలో మనమే దేవత,
మనమే పూజారి ,
మనమే యజ్ఞకర్త ,
మనమే ఆరాధకులం.
మనల్ని మనమే పుజించుంకుంటాం ,
మనల్ని మనమే ఆరాధన చేసుకుంటాం.
చిన్న చిన్న ఆలయాలు అన్నీ ఒకే ఒక మహాలయానికి అనుసంధానం అవుతాయి. ఆ మహాలయంలోని మహాదేవతా మూర్తి శ్రీ కాళీమాత. చిన్న చిన్న ఆలయాలు మానవులు.
రచన👌
శ్రీ రాధ నంద కాళీ యోగిని🙏
శ్రీ విశ్వ మాత ఆది పరా శక్తి పీఠం , Vejendla.🌄🔥🧘